Irrigation Minister Uttam Kumar Reddy: పాలమూరు-రంగారెడ్డి, సీతారామ సాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు వీలైనంత త్వరగా సాధించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంజినీర్లను ఆదేశించారు. ఆరు నెలల్లోగా అనుమతులు రావాలని లక్ష్యంగా పెట్టుకొని కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు.

సోమవారం సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ బలరాం నాయక్‌తో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కేంద్ర సంస్థల నుంచి తిరస్కరణకు గురైన ఈ నాలుగు ప్రాజెక్టుల ప్రతిపాదనలను సరిదిద్ది మళ్లీ సమర్పించాలని సూచించారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రాజెక్టుల అనుమతుల సాధనకు కొత్త అవకాశాలు కల్పించిందని, దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వం సాగించిన నిరంతర న్యాయపోరాటం ఉందని పేర్కొన్నారు.

ప్రతి ప్రాజెక్టుకు ఒక నోడల్ అధికారిని నియమించాలని, గౌరవెల్లి పంప్‌హౌస్‌ను పూర్తిస్థాయి నిర్వహణకు సిద్ధం చేయాలని, సీతారామ సాగర్‌కు అవసరమైన పర్యావరణ పత్రాలను వెంటనే నవీకరించాలని ఆదేశించారు. అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేలా సన్నాహాలు చేసుకోవాలని, పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు అనుమతులు సాధించాలని కూడా చెప్పారు. పోలవరం వెనుక జలాల ప్రభావాన్ని సమర్థంగా అంచనా వేయాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పూర్తయి వినియోగంలోకి రాకముందే ఉమ్మడి ఖమ్మం జిల్లాపై వెనుక జలాల ప్రభావం ఎంతవరకు ఉంటుందో స్పష్టంగా అంచనా వేసి కేంద్ర సంస్థల ముందు ఉంచాలన్నారు. బ్యాక్‌వాటర్ ప్రభావంతో నష్టపోయే భూములు, మౌలిక వసతులు, ఆస్తులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత కేంద్ర సంస్థలదేనని గుర్తు చేశారు. సీతమ్మసాగర్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, అది పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు పరిసర ప్రాంతాల వ్యవసాయ రంగానికి కొత్త ఊపు వస్తుందని అన్నారు.

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోలవరం ముంపుపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని సూచించారు. సమీక్షలో ఈఎన్‌సీలు రమేశ్‌బాబు, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story