గిల్ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ మిస్

Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ దిగ్గజం స్మృతి మంధానకు 2025 అద్భుతమైన సంవత్సరంగా నిలిచింది. అయితే ఒకే ఒక్క మ్యాచ్‌కు దూరమవ్వడం వల్ల పురుషుల క్రికెట్ స్టార్ శుభ్‌మన్‌ గిల్‌ రికార్డును అధిగమించే సువర్ణావకాశాన్ని ఆమె చేజార్చుకున్నారు. ఈ ఏడాది స్మృతి మంధాన అన్ని ఫార్మాట్లలో కలిపి 1,703 పరుగులు సాధించారు. మరోవైపు శుభ్‌మన్ గిల్ 1,764 పరుగులతో ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచారు. కేవలం 62 పరుగులు చేసి ఉంటే మంధాన అతడిని వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించేవారు.

శ్రీలంకతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో మంధానకు విశ్రాంతి ఇచ్చారు. 2025లో భారత్‌కు ఇదే చివరి మ్యాచ్ కావడంతో, ఆమె తన పరుగుల సంఖ్యను పెంచుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే అవుటైన మంధాన, నాలుగో టీ20లో మాత్రం వీరవిహారం చేశారు. కేవలం 48 బంతుల్లో 80 పరుగులు బాది ఫామ్‌లోకి వచ్చారు. మంగళవారం జరిగిన చివరి టీ20లో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 5-0తో కైవసం చేసుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (68 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story