Energy Drink Guidelines : కూల్ డ్రింక్స్ దిగ్గజం పెప్సికో ఇండియా తమ ప్రముఖ ప్రొడక్ట్ స్ట్రింగ్ కెన్లు, బాటిళ్లపై ఇక నుంచి ఎనర్జీ అనే పదాన్ని వాడకూడదని సంచలన నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) విధించిన 90 రోజుల గడువు ముగియడానికి ముందే కంపెనీ ఈ మార్పులు చేపట్టింది. ఎనర్జీ డ్రింక్స్ ను ఒక ప్రత్యేక కేటగిరీగా పరిగణించడాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ నిలిపివేయడమే ఇందుకు ప్రధాన కారణం. శరీరానికి, మనస్సుకు తక్షణ శక్తిని ఇస్తుంది అని చెప్పే వాదనలు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని రెగ్యులేటర్ స్పష్టం చేయడంతో పెప్సికో ఈ చర్యలు చేపట్టింది.

ఫార్ములా 1 యాడ్స్, లేబుల్స్ అన్నీ రీడిజైన్

ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల అమలులో భాగంగా స్ట్రింగ్ కొత్త కెన్లు, ప్యాకేజింగ్ బాటిళ్ల నుంచి ఎనర్జీ డ్రింక్ పదాన్ని తొలగించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా పెప్సికో ప్రసిద్ధ ఫార్ములా-1 గ్లోబల్ స్పాన్సర్‌షిప్ ఒప్పందానికి సంబంధించిన టీవీ అడ్వర్టైజ్‌మెంట్లు, ట్రాక్‌సైడ్ యాడ్స్, ప్రమోషనల్ కంటెంట్‌ను కూడా కొత్త లేబుల్స్‌తో రీడిజైన్ చేస్తోంది. కంపెనీ వర్గాల సమాచారం ప్రకారం కొత్త రకం కెన్లు, బాటిళ్లు త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి.

రూ. 13,000 కోట్ల మార్కెట్.. మిగతా కంపెనీల టెన్షన్

భారతదేశంలో ఎనర్జీ డ్రింక్స్ మార్కెట్ సైజు ఏకంగా రూ.13,000 కోట్లకు పైగా ఉందని అంచనా. ఈ కేటగిరీపై కంపెనీలు ప్రచారాల కోసం ఏటా సుమారు రూ. 2,000 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. రెడ్ బుల్, రసాయన్స్ కన్స్యూమర్ ప్రాడక్ట్స్, మాన్‌స్టర్, హెల్ వంటి ఇతర దిగ్గజ బ్రాండ్లు కూడా ఈ మార్కెట్‌లో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయి. అయితే ఎఫ్ఎస్ఎస్ఏఐ విధించిన జులై 1 గడువును పొడిగించాలని, ప్రింట్ అయిన ప్యాకేజింగ్ మెటీరియల్స్ వల్ల నష్టం జరుగుతుందని కోకాకోలా, పెప్సికోలతో కూడిన ఇండియన్ బెవరేజెస్ అసోసియేషన్ రెగ్యులేటర్‌కు విజ్ఞప్తి చేసింది.

డిస్ట్రిబ్యూటర్ల నో.. స్టాక్ కొరత హెచ్చరికలు

మరోవైపు పాత ఎనర్జీ డ్రింక్ లేబుల్స్ ఉన్న స్టాక్‌ను వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లు తీసుకోవడానికి నిరాకరిస్తుండటంతో చిల్లర దుకాణాల్లో ఈ తరహా సాఫ్ట్ డ్రింక్స్ కొరత కనిపిస్తోంది. 2017లో రూ.50 లతో మొదలై, ఆ తర్వాత రూ.20కే ప్లాస్టిక్ బాటిళ్లలో లభిస్తూ అద్భుతమైన మార్కెట్ షేర్ సాధించిన స్ట్రింగ్.. పెప్సికో ఇండియాకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలతో మార్కెట్‌లో ఈ డ్రింక్ అమ్మకాలు ఏ విధంగా సాగుతాయో చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story