అమెరికా షిప్పింగ్ ఖర్చుల భారం మన నెత్తినేనా?

LPG Price Hike : వంట గదిలో మళ్ళీ మంటలు మొదలయ్యేలా ఉన్నాయి. సామాన్యుడి బడ్జెట్‌లో కీలకమైన వంటగ్యాస్ ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లపై ఇచ్చే సబ్సిడీ లెక్కలను మార్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అరబ్ దేశాల నుంచి వచ్చే గ్యాస్ ధరల ఆధారంగా సబ్సిడీ ఇచ్చేవారు, కానీ ఇప్పుడు అమెరికా నుంచి దిగుమతులు మొదలవుతుండటంతో ఆ లెక్కలన్నీ తారుమారు కానున్నాయి.

భారతదేశానికి చెందిన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలు 2026 కోసం అమెరికా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకునేందుకు తొలిసారిగా భారీ ఒప్పందాలు చేసుకున్నాయి. సాధారణంగా మనకు సౌదీ అరేబియా నుంచి గ్యాస్ వస్తుంది, దానికి రవాణా ఖర్చులు తక్కువ. కానీ అమెరికా నుంచి వచ్చే గ్యాస్‌కు షిప్పింగ్ ఛార్జీలు సౌదీ కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. ఈ అదనపు రవాణా భారాన్ని ఎవరు భరించాలన్నదే ఇప్పుడున్న పెద్ద ప్రశ్న. అమెరికా సంస్థలు భారీగా తగ్గింపు ఇస్తే తప్ప, గ్యాస్ సిలిండర్ ధర పెరగకుండా ఉండటం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్ ఆధారంగా గ్యాస్ ధరలను నిర్ణయిస్తున్నారు. అయితే అమెరికా దిగుమతుల దృష్ట్యా, సబ్సిడీ లెక్కింపులో అమెరికా మార్కెట్ ధరలను కూడా కలపాలని ఆయిల్ కంపెనీలు కోరుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవాలని చూస్తే, ఆ ప్రభావం నేరుగా కస్టమర్ల జేబులపై పడుతుంది. ముఖ్యంగా ఉజ్వల పథకం కింద ఉన్న 10 కోట్లకు పైగా వినియోగదారులకు ఇప్పుడు వస్తున్న రూ.300 సబ్సిడీలో కోత పడొచ్చు లేదా సిలిండర్ ధర భారీగా పెరగొచ్చు.

ప్రస్తుతం ఢిల్లీలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.853 గా ఉంది. ఏప్రిల్ 2025లో చివరిసారిగా రూ.50 ధర పెంచారు. కమర్షియల్ గ్యాస్ ధర రూ.1,580.50 వద్ద కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 33 కోట్ల మంది ఎల్‌పీజీ వినియోగదారులు ఉండగా, ఇందులో 10.35 కోట్ల మంది ఉజ్వల లబ్ధిదారులు ఉన్నారు. కొత్త సబ్సిడీ విధానం అమల్లోకి వస్తే, అమెరికా నుంచి వచ్చే గ్యాస్ భారాన్ని వినియోగదారులపై వేస్తారా లేక ప్రభుత్వం తనంతట తానుగా భరిస్తుందా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా కొత్త ఏడాదిలో గ్యాస్ ధరల సెగ సామాన్యుడికి తప్పేలా లేదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story