IPO 2026: 2026లో ఐపీఓల జాతర.. 200 కంపెనీలు రెడీ..షేర్ మార్కెట్ షేక్ అవ్వడం ఖాయం
షేర్ మార్కెట్ షేక్ అవ్వడం ఖాయం

IPO 2026: షేర్ మార్కెట్లో 2025లో ఐపీఓల సునామీ చూశాం, కానీ 2026 అంతకు మించి ఉండబోతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించేందుకు వందలాది కంపెనీలు క్యూ కడుతున్నాయి. వచ్చే ఏడాది స్టాక్ మార్కెట్ కొత్త రికార్డులకు వేదిక కాబోతోంది. గడిచిన 2025 ఏడాది ఐపీఓ మార్కెట్‌కు ఒక మైలురాయిలా నిలిచింది. దాదాపు 100కు పైగా కంపెనీలు మార్కెట్లోకి వచ్చి సుమారు 1.76 లక్షల కోట్ల రూపాయలను పోగు చేశాయి. గతంతో పోలిస్తే ఇది చాలా పెద్ద మొత్తం. కంపెనీలకు మార్కెట్ మీద ఉన్న నమ్మకం, ఇన్వెస్టర్ల ఉత్సాహం ఈ స్థాయి వృద్ధికి కారణమయ్యాయి. ఈ జోష్‌ను చూస్తుంటే 2026లో కూడా ఇదే ఊపు కొనసాగుతుందని అర్థమవుతోంది.
తాజా గణాంకాల ప్రకారం.. 2026లో ఏకంగా 200కు పైగా కంపెనీలు ఐపీఓ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలకు సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, మరికొన్ని అనుమతుల కోసం వేచి చూస్తున్నాయి. అంతా సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది ఐపీఓల ద్వారా సుమారు 1.2 లక్షల కోట్లకు పైగా నిధులను కంపెనీలు సేకరించే అవకాశం ఉంది. అంటే ఇన్వెస్టర్లకు ప్రతి నెలా ఏదో ఒక పెద్ద కంపెనీలో పెట్టుబడి పెట్టే అవకాశం లభిస్తుంది.
ఈసారి కేవలం సంప్రదాయ కంపెనీలే కాకుండా, కొత్త తరం టెక్, డిజిటల్ బిజినెస్ కంపెనీలు కూడా మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అయితే ఇన్వెస్టర్ల ఆలోచనా విధానంలో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో ప్రతి ఐపీఓకు గుడ్డిగా ఎగబడేవారు, కానీ ఇప్పుడు కంపెనీ క్వాలిటీ, వాల్యుయేషన్, బిజినెస్ మోడల్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అందుకే ఓవర్ సబ్స్క్రిప్షన్ రేటు కాస్త తగ్గినట్లు అనిపించినా, నాణ్యమైన కంపెనీలకు మాత్రం ఇన్వెస్టర్లు బ్రహ్మరథం పడుతున్నారు.
2026లో అవకాశాలు కొల్లలుగా ఉన్నప్పటికీ, రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం కాస్త ఆచి తూచి అడుగు వేయాల్సి ఉంటుంది. మార్కెట్ స్థిరంగా ఉండి, కంపెనీలు సరైన ధరకే షేర్లను ఆఫర్ చేస్తే ఐపీఓల ద్వారా భారీగా సంపాదించుకోవచ్చు. గుడ్డిగా కాకుండా, రీసెర్చ్ చేసి సరైన కంపెనీని ఎంచుకున్న వారికే 2026లో ఐపీఓల పంట పండుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

