MG Motors :కారు వాడండి..ఐదేళ్ల తర్వాత కంపెనీకే అమ్మేయండి
ఐదేళ్ల తర్వాత కంపెనీకే అమ్మేయండి

MG Motors : ఎలక్ట్రిక్ కారు కొనాలంటే చాలా మందికి ఉండే ప్రధాన భయం.. కొన్న కొన్ని ఏళ్లకే దీని రీసేల్ వాల్యూ పడిపోతుందేమో అని. కస్టమర్ల మనసులో ఉన్న ఈ అనుమానాన్ని పటాపంచలు చేస్తూ JSW MG మోటార్ ఇండియా ఒక అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. గతంలోనే బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ లాంటి వినూత్న పద్ధతులను తీసుకొచ్చిన ఎంజీ, ఇప్పుడు ఏకంగా 5 ఏళ్ల అష్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. అంటే కారు కొని ఐదేళ్లు వాడిన తర్వాత తిరిగి కంపెనీకే అమ్మేయొచ్చు.
సాధారణంగా ఏ కారైనా షోరూమ్ నుంచి బయటకు రాగానే దాని విలువ పడిపోవడం మొదలవుతుంది. కానీ ఎంజీ మోటార్ కొత్తగా ప్రవేశపెట్టిన వాల్యూ ప్రామిస్ పథకం కింద, మీరు కొన్న ఎలక్ట్రిక్ కారుకు ఐదేళ్ల తర్వాత కూడా గ్యారెంటీ ధర లభిస్తుంది. కస్టమర్ ఎంచుకునే ప్లాన్‌ను బట్టి కారు అసలు ధరలో 40 శాతం నుంచి 60 శాతం వరకు వెనక్కి ఇస్తామని కంపెనీ భరోసా ఇస్తోంది. గతంలో ఈ సౌకర్యం కేవలం 3 ఏళ్ల వరకే ఉండేది, ఇప్పుడు దానిని 5 ఏళ్లకు పొడిగించి వాహనదారులకు పెద్ద ఊరటనిచ్చారు.
ఈ బైబ్యాక్ ఆఫర్ కేవలం సొంతానికి వాడుకునే వారికే కాకుండా, కమర్షియల్ వాహనాలుగా నడిపే వారికి కూడా వర్తిస్తుంది. అయితే దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈ సౌకర్యం పొందాలంటే కారు ఏడాదికి గరిష్టంగా 60,000 కిలోమీటర్ల లోపు మాత్రమే తిరిగి ఉండాలి. జునో జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి ఎంజీ ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. ఐదేళ్ల తర్వాత కారును కంపెనీకే ఇచ్చేయాలా, మీ దగ్గరే ఉంచుకోవాలా లేక కొత్త ఎంజీ మోడల్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలా అనేది పూర్తిగా మీ ఇష్టమే.
ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఇంకా ఎదుగుతున్న దశలోనే ఉండటంతో, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వీటికి సరైన ధర వస్తుందో రాదో అన్న ఆందోళన అందరిలోనూ ఉంది. ఎంజీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కస్టమర్లకు ఆర్థిక భద్రత లభిస్తుంది. కారు వాల్యూ పడిపోతుందనే రిస్క్ కంపెనీదే కాబట్టి, ధైర్యంగా ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. లోన్ లేదా ఫైనాన్స్ స్కీమ్స్‌తో సంబంధం లేకుండా ఈ బైబ్యాక్ ప్రోగ్రామ్ విడిగా పనిచేస్తుంది, ఇది కస్టమర్లకు మరింత వెసులుబాటును ఇస్తుంది.

