Pawan Kalyan Meets Chandrababu Naidu: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, రెబల్స్, ఫేక్ ప్రచారంపై కీలక చర్చలు
కీలక చర్చలు

Pawan Kalyan Meets Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బుధవారం మధ్యాహ్నం ఒంటరిగా వచ్చారు. ఎలాంటి భద్రతా ఏర్పాట్లు, కాన్వాయ్ లేకుండా తన వ్యక్తిగత వాహనంలోనే సీఎం నివాసం చేరుకున్నారు. డ్రైవర్ వాహనం నడుపుతుండగా పవన్ కల్యాణ్ కారులోనే ప్రవేశించారు. ఇరువురి మధ్య సుమారు అరగంట పాటు కీలక చర్చలు జరిగాయి.
పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్) ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు, ఎన్నికల వాయిదా అవకాశాలు, ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న చర్యలపై విస్తృతంగా చర్చించారు. స్థానిక ఎన్నికల్లో రెబల్స్ వ్యవహారం, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపైనా సమాలోచనలు జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పట్టణ స్థానిక సంస్థల పోలింగ్ తేదీలు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరువురు వ్యూహాలపై కూడా చర్చించారు.
అదేసమయంలో ఉదయం నుంచి సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న ఫేక్ ప్రచారం గురించి కూడా వివరంగా మాట్లాడుకున్నారు. ఈ ఫేక్ ప్రచారంపై ఇప్పటికే డిప్యూటీ సీఎం కార్యాలయం సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసింది. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధ్యులు ఎవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గత రాత్రి సుప్రీంకోర్టు తీర్పు, ఎన్నికల కమిషన్ చర్యలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
చర్చలు ముగిసాక పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రకటనలు చేయకుండా తిరిగి వెళ్లిపోయారు. ఈ భేటీ కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత బలపరచడమే కాకుండా, స్థానిక ఎన్నికల్లో ఏకీకృత వ్యూహం రూపొందించేందుకు కూడా దోహదపడిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

