Former YSRCP MLA Mustafa: గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు షేక్ మహమ్మద్ ముస్తఫా కిడ్నాప్ కేసులో గుజరాత్‌లో నూజివీడు పోలీసులకు చిక్కారు. పరారీలో ఉన్న ముస్తఫాను సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గుర్తించి అరెస్టు చేశారు. పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు.

వ్యాపార వివాదం నేపథ్యంలో జరిగిన ఈ ఘటనలో ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్‌పై కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ముస్తఫాకు గుంటూరులో పొగాకు గోదాము ఉంది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంకు చెందిన పొగాకు వ్యాపారి కడిమి సూర్యచంద్రం రైతుల నుంచి సేకరించిన పొగాకును ముస్తఫాకు అమ్మేవారు. ఇటీవల ధరలు భారీగా తగ్గడంతో సూర్యచంద్రం ముస్తఫాకు సరుకు ఇవ్వడం ఆపేసి మరో కంపెనీకి విక్రయించడం ప్రారంభించారు.

సోమవారం రాత్రి సూర్యచంద్రం కుమారుడు అభి, డ్రైవర్ బాలరాజు, గుమస్తా దుర్గారావు పొగాకు బేళ్లను లోడ్ చేసుకొని కొయ్యలగూడెం నుంచి గుంటూరు వైపు బయలుదేరారు. మార్గమధ్యలో నూజివీడు సమీపంలో ముస్తఫా కుమారుడు బషీర్, అనుచరులు రెండు కార్లలో వచ్చి వారిని అడ్డగించారు. పొగాకు వాహనంతో సహా వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. డబ్బులు చెల్లిస్తేనే వదిలేస్తామని బెదిరించారు. అభి తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పగా, సూర్యచంద్రం ముస్తఫాకు ఫోన్ చేశారు. అయితే ముస్తఫా ‘డబ్బులు తీసుకుని గోదాము వద్దకు రా.. లేదంటే నీ కొడుకు దక్కడు’ అని హెచ్చరించారు.

వెంటనే సూర్యచంద్రం పోలీసులకు సమాచారం ఇచ్చారు. నూజివీడు పోలీసులు గుంటూరు జిల్లా పెదకాకాని స్టేషన్ సిబ్బందికి తెలియజేశారు. పోలీసులు ముస్తఫాకు ఫోన్ చేసి బాధితులను విడుదల చేయాలని హెచ్చరించారు. మంగళవారం తెల్లవారుజామున కిడ్నాపర్ల ముఠా బాధితులను వెంటబెట్టుకొని పెదకాకాని ఠాణాలో లొంగిపోయింది. అయితే ముస్తఫా, బషీర్ పరారీ అయ్యారు. ఇంతకు ముందు ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు ముస్తఫా కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. చివరకు గుజరాత్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి చేరుకొని అరెస్టు చేశారు.

ఈ కేసులో మరిన్ని విచారణలు కొనసాగుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story