CM Chandrababu: అన్ని శాఖల్లో డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (ఆర్‌టీజీఎస్)లో డేటా ఆధారిత నిర్ణయాలపై సోమవారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌తో పాటు ఐటీ, ఆర్‌టీజీఎస్, వ్యవసాయం, మున్సిపల్, సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ పనితీరుపై సీఎం వివరంగా సమీక్షించారు. ఆర్‌టీజీ ద్వారా పాలన మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండాలని సూచించారు.

ప్రభుత్వ నిర్ణయాల్లో డేటా వినియోగాన్ని గణనీయంగా పెంచాలని ఆదేశించారు. ఆయా శాఖల వారీగా డేటా సమన్వయం ఎలా జరగాలి, సమాచారం ఎలా సమీకరించాలి అనే అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. డేటా ఆధారంగా తీసుకునే నిర్ణయాలు ప్రజలకు మరింత ప్రయోజనకరంగా ఉంటాయని సీఎం అభిప్రాయపడ్డారు.

ఈ సమీక్షలో డేటా ఆధారిత పాలనను అన్ని శాఖల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని, అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story